శేషేంద్ర సింహనాదం ‘మండే సూర్యుడు’
Prajasakti : Telugu Daily : Jul 8,2024
”కాలపు కఠిన శిలల్లోంచి
కాంతి జ్వాల త్రవ్వి తీస్తా !
ఎదిరించే శతాబ్దాల నిదురకు నిప్పంటిస్తా!”
ఇది సూర్యుని ఆవాహనం చేసుకున్న గుంటూరు శేషేంద్ర శర్మ సింహనాదం. ఆయన రచించిన మినీ కవితా సంకలనం ‘మండే సూర్యుడు’లోని తొలి కవితలోనే ఈ ప్రతిజ్ఞ చేశారు. 1974లో వెలువడిన ఈ కావ్యానికి 2024 స్వర్ణోత్సవ సంవత్సరం.
ప్రాచీనాంధ్ర సారస్వతానికి పట్టుకొమ్మ అయిన పద్యంపై సమున్నత సాధికారత సాధించిన శేషేంద్ర ‘ఋతుఘోష’ వంటి సర్వకాలీనమైన పద్య కావ్యాలు వెలువరించారు. ఆ తరువాత జరిగిన సమకాలీన సారస్వత పరిణామాలనూ ఆయన ఆహ్వానించారు. ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ పేరుతో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడైన కుందుర్తి వచన కవితలోనూ మహాకావ్యాల ఆవిర్భావం జరగాలని ఆశించారు. అందుకు శేషేంద్ర సమ్మతించడమే విశేషం. పర్యవసానంగా శిష్ట సంశ్లిష్ట సంస్క ృత పదభూయిష్ట సుదీర్ఘ సమాస చాలనంలో సిద్ధహస్తులైన శేషేంద్ర సరళతరమైన వచన కవిత వైపు దృష్టి సారించి మినీ కవితకు ఆద్యులయ్యారు. ఆ దశలో వెలువడిన వచన కవితల సమాహారమే ‘మండే సూర్యుడు.’ ఆ తదనంతరం శేషేంద్ర రూపొందించిన, పవన్ కళ్యాణ్ పునర్ముద్రించిన ‘ఆధునిక మహాభారతం’ బృహత్కావ్యంలో మండే సూర్యుడు ‘సూర్య పర్వం’గా చోటుచేసుకుంది.
శేషేంద్ర గారి ప్రతిజ్ఞను ప్రేరణగా తీసుకొని అర్ధ శతాబ్ది నాటి ఈ కవితలను మరోమారు పరిశీలిస్తే మిరుమిట్లు గొలిపే కాంతి జ్వాలలెన్నో గోచరిస్తాయి. శిలలు కాలానికి ప్రత్యక్ష సాక్షులు. శిలల రూపురేఖలను పరిశీలించి, వాటి గర్భంలో నిదురించే మూలకాలను పరిశోధించి కాలాన్ని అంచనా వేస్తారు. ఆ విధంగా కఠిన శిలలను నాటి సామాజిక స్థితిగతులకు ప్రతీకలుగా దర్శించిన శేషేంద్ర ఆశించే విప్లవమే తాను త్రవ్వి తీయాలనుకున్న కాంతి జ్వాల.
పాతకాలం పద్యమైతే.. వర్తమానం వచన కవిత్వం అన్నది ఆనాటి ధోరణి. వచన కవితలో అంత్యప్రాసలు, చమత్కారం, అధిక్షేపణం, ప్రముఖ పాత్ర వహిస్తాయి. వేమన ఆటవెలదిలోని సూటితనం, గజల్ నిర్మాణ చాతుర్యం, అనుష్టుప్ ఛందస్సులను ఔపోసన పట్టిన పండిత కవి శేషేంద్ర హృదయంలో రూపుదిద్దుకున్న మినీ వచన కవితలు మండే సూర్యునిలానే తళుక్కుమంటాయి.
నేను చెమట బిందువును
కండల కొండల్లో ఉదయించే
లోక బంధువును .. అంటూ ప్రారంభమయ్యే ఈ కావ్యంలో శేషేంద్ర కాలానికి, సూర్యునికి, ఆత్మగౌరవానికి ,శ్రమ శక్తికి ఎన్నో ఉపమానాలను ఎన్నో ప్రతీకలను సృష్టించారు. ”నా శరీరం/ ఒక శాశ్వత హౌమం/ అది సూర్యుడి స్వగహం” అంటూ తనే స్వయంగా మండే సూర్యునిలో అంతర్భాగమయ్యారు. ”కవిత్వం ఒక మెస్మరిజం/ కవి కన్ను ఒక ప్రిజం / నేను సృష్టించిన అలంకారం / నీ అంధకారానికి దీపం” అన్న శేషేంద్ర మనో నేత్రానికి మాత్రమే సాక్షాత్కరించే మనోహర దృశ్యాలెన్నో అక్షర వర్ణచిత్రాలై ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి.
”అస్తమించే నక్షత్ర లోకాన్ని / ఆవలిస్తూ చూసింది కాలం”, ” నాగలి భుజాన వేసుకుని/ వస్తున్నాడు సూర్యుడు/ కొండ శిఖరాలెక్కి ..”, ”అడవిలో అగ్నిజ్వాలలు/ కాషాయ వస్త్రాలను ధరించిన/ సన్యాసుల గుంపులా/ పరిగెత్తుతున్నాయిప్పుడు” … నిస్సత్తువను నిరసించే శేషేంద్ర శ్రమ శక్తికి సాష్టాంగ పడతారు.ఆ శ్రమ శక్తికి సృజనాత్మకతను జోడించడమే శేషేంద్ర వీక్షణం.
”మట్టితో జీవ శిల్పం మలచే వాడి ముందు
శూన్యంతో రేఖలు వంచే వాడి ముందు
రూపాలు మోకారిస్తాయి!”
”చెట్టు సూర్యుని గర్భంలో ధరిస్తుంది
చెట్టు గర్భం అంతర్లోక ఆకాశం”
”వర్షం వేయి చేతులతో
నా తలుపు కొడుతుంది”
శేషేంద్ర కంటిలో ప్రిజం ఉన్నందు వల్లనే ఆయన కవిత్వంలో మనకు ఈ మెస్మరిజం కనిపిస్తుంది. ”పూర్ణమదః పూర్ణమిదం” అంటూ ఉపనిషత్తులు వివరించే మార్మిక పరిభాషను ”సున్నలో బంధించబడ్డ ఆకాశం” అంటూ ఆయన మాత్రమే అంత సరళ సుందరంగా భావ వ్యక్తీకరణ చేస్తారు.
శేషేంద్ర మహౌన్నత స్వాప్నికులు.
”రాత్రి నేను నా దిండు కలసి కలలు కంటాం
పగలు నేను నా కలం వాటిని పంచుకుంటాం” అంటున్న శేషేంద్ర తన కలల గురించి చెబుతూ – ”కాగితాల పడవల్లో/ కలలు ప్రయాణం చేస్తున్నాయి” అంటున్నారు పసి హృదయంతో. అలా అని అవి ఏవో చంటి పిల్లల కలలు అనుకుంటే పొరపాటు. ఇంతకూ ఏమిటా కలలు అంటే.. ”వంగిపోతున్న దేశానికి/ నింగి ఎత్తు వెన్నెముక నిర్మించే పండుగలో పాల్గొంటున్నాయి” అంటున్నారు.
తూర్పు దిశలో ఉదయిస్తున్న ప్రభాత సూర్యబింబాన్ని చూసి స్పందించని కవులుండరు. తమను తాము మరిచిపోతూ ఏదో అసంకల్పిత పారవశ్యానికి లోనై ఆ దృశ్యాన్ని వర్ణించడం పరిపాటి. శేషేంద్ర కూడా ‘ఋతుఘోష’లో సూర్యుని వర్ణిస్తూ ‘దుర్నిరీక్ష్య ప్రభాధూర్ధరచ్ఛటలతో…’ పటు రోషకాషాయ కుటిలాంశుకశలతో..’ఖర మయూఖ క్రూర ఘనకాండ పటలితో..’ గ్రీష్మకాల ప్రాంశు కింశుక ద్యుతులతో.. ‘గగన ఘన ఘోట ఖుర నిరాఘాట ధాటి..’ అంటూ ధాటిగా మార్తాండుని ప్రచండ రథాన్ని వర్ణించారు. అదే శేషేంద్ర ఈ మండే సూర్యుడులో…
”సూర్యుడు ప్రాచీ రేఖ మీద ఉన్నాడు
అలమారు మీద ఆపిల్ పండులా” అన్నారు. అరుణోదయ సూర్యబింబాన్ని ఇంత సరళ సుందరంగా సహజ స్వభావోక్తిలో వర్ణించడం మళ్లీ శేషేంద్రకే సాధ్యమైంది. ఈ విధంగా శేషేంద్ర ప్రారంభించిన మినీ కవితా మహౌద్యమం తెలుగు నాట ఉత్తుంగ తరంగాలుగా విస్తరించింది. మళ్లీ 1985లో శేషేంద్ర ఆంధ్ర జ్యోతిలో శేషేంద్రజాలం శీర్షికన ‘అరుస్తున్న ఆద్మీ’ పేరుతో మళ్లీ లఘు కవితలు రాశారు. ఆధునిక మహాభారతంలో ‘ఆద్మీ పర్వం’ పేరుతో ఇవి చోటు చేసుకున్నాయి. ఇందులో మళ్ళీ తొలి కవిత సూర్యుని పైనే కావడం విశేషం.
”సూర్యుడి నుంచి సూర్యుడికి
ఇరవై నాలుగు గంటల దూరం
మనిషి నుంచి మనిషికి
రెండు గుండెల దూరం”
తెలుగునాట బహుళ ప్రచారంలో ఉన్న ఈ శేషేంద్ర మినీ కవిత ఇందులోదే. శేషేంద్ర హృదయం ప్రళయ విస్ఫోటనాలకే కాదు, ప్రశాంతతకూ కేంద్రమే!
”పావురంలా రాత్రి నా గుండె మీద వాలింది
బాధల తుఫానును ఒక నవ్వుతో తుడిచి వేశాను” అంటూ మండే సూర్యునిలో శేషేంద్ర చూపించిన ఈ పరిష్కార మార్గం ఈనాటి ప్రపంచ మానవాళికి శిరోధార్యం!
– డా. వెనిగళ్ల రాంబాబు
కవి, సినీ గీత రచయిత, అధ్యాపకులు
-------
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
-----------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
0 comments